AP CM Chandrababu: తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనేది ఆకాంక్ష.. సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu speaks at IIT Madras: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, అందులోనూ తెలుగువారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 ప్రోగ్రాంకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, భవిష్యత్ అంతా భారతీయులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో తెలుగు విద్యార్థులు రాణించాలన్నదే తన స్వార్థమన్నారు. ఇందు కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నామన్నారు. అందులోనే అన్ని సాంకేతికతలను ఏర్పాటు చేస్తామని, భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి అని చంద్రబాబు వెల్లడించారు.
ఇక, మద్రాస్ ఐఐటీ విషయానికొస్తే.. అన్ని అంశాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్నారు. ఆన్‌లైన్ కోర్సులు, స్టార్టప్ అగ్నికుల్ వంటివి ప్రవేశపెట్టగా.. 80 శాతానికిపైగా విజయవంతమవుతున్నాయన్నారు. ఇందులో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తెలుగు విద్యార్థులు ఉండడం గర్వించదగిన విషయమని వెల్లడించారు. గత కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు అత్యధికంగా ఉంటుందన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ.. తాజాగా, ఐదో స్థానానికి చేరిందని చెప్పారు.