AP Government: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచితంగా కందిపప్పు, రాగులు!

AP Government Good News To Ration Card Holders: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు మరింత మేలు చేసుందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులతో పాటు పోషక విలువలు ఉన్న కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.
ఇందులో భాగంగానే జూన్ నెల నుంచే రేషన్‌లో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మూడు నెలలకు సరిపాడా కందిపప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లు సైతం ఆహ్వానించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మొత్తం 1.46కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పౌరసరఫరాల శాఖ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రేషన్ లబ్ధిదారులతో పాటు అంగన్ వాడీ కేంద్రాలకు జూన్ నుంచి ఆగస్టు వరకు దాదాపు రూ.500 కోట్లతో 47,037 టన్నుల కందిపప్పు, రూ.100కోట్లతో 25వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార కోసం టెండర్లు ఆహ్వానించింది.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కందిపప్పును కిలో చొప్పున ప్యాకెట్లు, రాగులను క్వింటాళ్ల రూపంలో గోనె సంచుల్లో సప్లై చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో రవాణా చేయనుంది. ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.