Andhra Pradesh: నాకు వచ్చిన మొదటి ఉద్యోగం అదే : సీఎం చంద్రబాబు

Andhra Pradesh: నమ్మకానికి దృఢ సంకల్పం తోడైతే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. వేధికపై మాట్లాడిన ఆయన, విజయం సులభంగా రాదని అందుకు కృషి అవసరమన్నారు. అందుకు ఎన్టీఆర్ నిధర్శనమన్నారు.
చదువుకునే రోజుల్లో నేను బాగా చదువుకుంటే ఐఏఎస్ అవుతావని కొందరు అనేవారన్నారు. అయితే పదిమంది అధికారులలో ఒకడిని అవుతానని అనుకున్నాను. మా యునివర్సిటీలో వీసీ పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తా చేస్తావా అని అడిగితే నేను చేయనని చెప్పాను. తాను ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నానని చెప్పాను. అనుకున్న విధంగానే ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచాను.
ఆతర్వాత అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గరికి వెళ్లి తనకు మంత్రి పదవి ఇవ్వండని అడిగితే, మొన్నటి వరకు విద్యార్థిగా ఉన్న నువ్వు ఇప్పుడే మంత్రి పదవి కావాలని అడుగుతున్నావా అని అన్నారు. నాకు అర్హత ఉంటే ఇవ్వండి లేకుంటే లేదని చెప్పి వచ్చేశాను. అనుకున్నట్లే రెండేళ్లకు నేను సినిమాటోగ్రఫీ మంత్రిని అయ్యాను. కొంతకాలానికి నందమూరి జయకృష్ణ సూచనమేరకు ఎన్టీఆర్ ను కలిశాను. ఆతర్వాత భువనేశ్వరీతో పెళ్లి జరిగింది.
దృడసంకల్పం మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే నిదర్శనమన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి మామూలు కుటుంబంలోంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగారన్నారు. ప్రతీ వ్యక్తి జీవితంలో చాలెంజెస్ వస్తాయి వాటిని తట్టుకుని నిలపడాలి అప్పుడే గొప్పవారవుతారు. మాహాత్మాగాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ల జీవితాల్లో కూడా కష్టాలు వచ్చాయి. వారు వాటిని అధిగమించి ఆదర్శ వ్యక్తులయ్యారన్నారు.
ఎన్టీఆర్ చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. విజయవాడకు చదువుకోవడానికి నానమ్మతో కలిసి ఇక్కడే ఒక గుడిసె వెసుకుని ఉన్నారట. గాలి, తుఫాను ధాటికి గుడిసె కూలిపోతుందేమోనని రాత్రంతా అలాగే పట్టుకుని ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాలలో 12ఏళ్లు మాత్రమే ఉన్నా చిరస్థాయిగా నిలిపోయారు.
తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని అన్నారు చంద్రబాబు. ఐటీ అంటే తెలియని వాళ్లు అప్పుడు ఎంతో మంది ఉండేవారు. తెలిసిన కొందరిని వాడుకుని ఆ సమయంలోనే హైటెక్ సిటీ డెవలప్ చేశాం. అప్పట్లో ఐఐటీలో ఒక్క శాతం అడ్మిషన్లు కూడా వచ్చేవికావు. తరువాత విద్యాసంస్థల అధినేతలను పిలిచి మాట్లడాను. ఇప్పుడు 20శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. కాబట్టి దేనికైనా ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు నడిస్తే విజయాలు సాధిస్తామన్నారు.