AP CM Chandrababu Naidu : ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP CM Chandrababu Naidu : చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పున:నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను చాలాసార్లు ప్రధాని మోదీని కలిశానని, నిమిషాల కొద్ది మాట్లాడినట్లు గుర్తుచేశారు. కానీ, మొన్న కలిసినప్పుడు మోదీ కళ్లలో ఆవేదన చూశానని చెప్పారు. ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయనే బాధ మోదీలో కనిపించిందన్నారు. మేమంతా మీతో ఉన్నామని ప్రధానికి సీఎం భరోసా ఇచ్చాడు. ఉగ్రదాడి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతిస్తామని ప్రకటించారు.
ప్రధాని మోదీ చేతుల్లో దేశం చాలా సేఫ్‌గా ఉందన్నారు. సరైన సమయంలోనే దేశానికి మంచి నాయకుడు ఉన్నాడని అందరిలోనూ భరోసా కలుగుతోందన్నారు. ఇంత కఠిన పరిస్థితుల్లో మోదీ ఏపీకి రావడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ సాయంతో ఏపీ బయటపడుతోందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని చెప్పారు. కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైనదని, ఇది గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని వెల్లడించారు.
అమరావతి లాంటి ఉద్యమం చరిత్రలో తాను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎంతో పోరాటం చేశారని, వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టినా ఎక్కడా తలొగ్గలేదని కొనియాడారు. వైసీపీ విధ్వంస పాలనకు ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేశారన్నారు. అమరావతి ఒక నగరం కాదని, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు పున:ప్రారంభం చేసుకుంటున్నామని చెప్పారు.
మూడేళ్లలో అమరావతి పున:నిర్మాణ పనులు పూర్తిచేస్తామని కీలక ప్రకటన చేశారు. కాలుష్య రహిత నగరంగా నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రణాళికాబద్ధమైన నగరంగా అమరావతి రూపాంతరం చెందబోతోందని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తుచేశారు. ఎవరినీ అసంతృప్తికి గురిచేయబోమని ‘అమరావతి మా రాజధాని’ అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు.