Rain Alert: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన

Rain Alert Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీలోని యానాం, రాయలసీమ వంటి ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రిలో వర్షం పడుతోంది. కల్లాలు, వ్యవసాయ మార్కెట్‌లలో వరి ధాన్యం తడిచింది. ఈ మేరకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు పడడంతో తాము ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో ఎవరూ కూడా చెట్ల కిందకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఏపీలో ఒకవైపు మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. అయితే సాయంత్రం విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుతం ఏపీలో గంటకు 11 కిలోమీటర్ల వేగం, తెలంగాణలో మాత్రం గంటకు 9 కిలోమీటర్ల వేగం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో మాత్రం గాలివేగం గంటకు 18 కిలోమీటర్లు ఉంది. అయితే వర్షాలు కురిసే సమయానికి గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉంటుందని తెలిపింది.