CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక కావాలి

CM Chandrababu review of Preliminary report on Simhachalam incident: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న దేవస్థానంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. రూ.300 టోకెన్ క్యూలైన్ వద్ద రాత్రి పడిన భారీ వర్షానికి గోడ కూలింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగ ఉన్న కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.
తాజాగా, సింహాచలం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరణ చేపట్టనున్నారు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే, గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. కాగా, ప్రధాని మోదీ జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడన బాధితులకు రూ.50 వేలు చొప్పున ప్రకటించారు.
అలాగే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన బాధితులకు రూ.3లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సిగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చంద్రబాబు చెప్పారు.