Indian Railway : అధిక ధరపై ఫిర్యాదు.. రైలు ప్రయాణికుడిపై దాడి.. క్యాటరింగ్ కాంట్రాక్టు రద్దు

Passenger attacked by staff on Hemakunt Express train : ట్రైన్, రైల్వే స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాలను ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలి. కానీ, కొందరు రైల్వే శాఖకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల అదును చూసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో ఓ రైల్లో వాటర్ బాటిల్‌ను ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ డబ్బులకు విక్రయించాడు. దీంతో సదరు ప్రయాణికుడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్యాటరింగ్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. సిబ్బందికి చెందిన హోటల్‌తో కుదుర్చుకున్న క్యాటరింగ్ ఒప్పందాన్ని రైల్వే అధికారులు రద్దు చేశారు.
హేమకుంత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఘటన..
ఈ నెల 7వ తేదీన హేమకుంత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది. మూడో ఏసీ బోగీలో విశాల్ అనే యూట్యూబర్ ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు నీళ్ల బాటిల్ కొనుగోలు చేశాడు. ఎక్కువ ధరకు విక్రయించడంతో ‘రైల్ మదద్’ యాప్‌లో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది గుంపులు గుంపులుగా ప్రయాణికుడి సీటు వద్దకు వచ్చి అతడితో దురుసుగా వ్యవహరించారు. పై బెర్త్‌లో ఉన్న అతడిని కిందకు దిగాలంటూ గొడవకు దిగడంతోపాటు దాడి చేశారు.
సొంత యూట్యూబ్‌లో పోస్ట్..
క్యాటరింగ్ సిబ్బందితో జరిగిన గొడవను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. మిస్టర్ విశాల్ పేరిట నిర్వహిస్తున్న తన సొంత యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. వీడియోను స్కిన్ డాక్టర్ అనే మరో ఎక్స్ హ్యాండిల్ రీపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే శాఖ కూడా స్పందించింది. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొలుత సంబంధిత క్యాటరర్‌కు రూ.5లక్షలు జరిమానా విధించింది. దాడికి పాల్పడిన సిబ్బందిపై కథువా జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. అనంతరం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. దాడికి పాల్పడిన సిబ్బందికి చెందిన హోటల్ రాజస్థాన్‌తో ఐఆర్‌సీటీసీ తన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసినట్లు ప్రకటించింది.