Andhra Pradesh Cabinet : పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. ఏపీ కేబినెట్ ఆమోదం

AP CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు కేబినెట్ అభినందలు తెలిపింది. ప్రధాని మోదీ, ఇండియా సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వల్ల అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.
2014 పునర్విభజన చట్టం..
2014 పునర్విభజన చట్టంలో రాజధాని అమరాతి అని లేదని, ఒకసారి పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని నిర్ణయిస్తే రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని పలువురు న్యాయనిపుణులతోపాటు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన రైతులు సూచించారు. ఈ క్రమంలో రాజధాని అమరావతిగా నిర్ణయం చేసి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 2014 పునర్విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్న ఉభయ సభలు ఆమోదించాయి.
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలి..
పునర్విభజన చట్టంపై ఢిల్లీలోని ఎంపీలతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించేలా చూడాలని నిర్ణయించారు. అందువల్ల గురువారం కేబినెట్‌లో తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు మరో అంశంపై చర్చించారు. ఏపీలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపు, రాజధాని అమరావతిలో ఇటీవల సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో భూముల కేటాయింపుపై చర్చించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు వల్ల ఎంతో ఉపయోగం ఉందని మంత్రులకు సీఎం వివరించారు.
‘ఆపరేషన్ సిందూర్’కు అభినందనలు..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కేబినెట్ అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్‌చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే ముందు అందరికీ దగ్గరయ్యేలా పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.