CM Revanth Reddy: నిజాలను మార్చే ఫేక్ వీడియోలు.. అసత్య ప్రచారాలపై సీఎం రేవంత్ సీరియస్

CM Revanth Reddy Review Meeting with Ministers on Kancha Gachibowli Land Cases: హైదరాబాద్ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తున్న ఫేక్ వీడియోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరాలని అధికారలను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్‌ను సిద్ధం చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్‌లో యుద్ధాలకు బీజం వేస్తుందని వెల్లడించారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. జింకలు, నెమళ్లతో విడుదలైన వీడియోలు ఫేక్ అని పోలీసులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
అస్యత ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని సీఎం అన్నారు. నిజాలను మార్చే ఫేక్ వీడియోలు చాలా ప్రమాదకరమన్నారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరమని సీఎం చెప్పారు. అందుకే ఏఐ ఫేక్ కంటెంట్‌ను పసిగట్టేందుకు ఫొరెన్సిక్, సాఫ్ట్ వేర్, హర్డ్ వేర్ టూల్స్‌ను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సీఎస్ శాంతికుమారి అధికారులు పాల్గొన్నారు.