Pakistan: హైదరాబాద్‌లో తనిఖీలు.. పోలీసుల అదుపులో పాక్ యువకుడు

Pakistan : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. దాడి నేపథ్యంలో కేంద్రం పాక్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు దేశంలోని అన్నిరాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
మహమ్మద్ ఫయాజ్‌గా గుర్తింపు..
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో నిర్వహించిన తనిఖీల్లో పాక్‌కు చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఫయాజ్ గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడని తేలింది. తన భార్యను చూసేందుకు పాక్ నుంచి రావడం కష్టమని అతడు భావించాడు. నేపాల్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించి ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మహమ్మద్ ఫయాజ్ ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు? అతడికి సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారా? అతడి రాక వెనక ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫయాజ్ ప్రయాణ వివరాలు, వీసా సమాచారం, నేపాల్ నుంచి వచ్చిన దారులు, అతడి ఇతర సంబంధాలపై అధికారులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత అతడిని పాక్‌కు పంపడానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటన మరోసారి పాక్ పౌరులపై కేంద్రం తమ నిఘాను బలపరుస్తున్నట్లు స్పష్టంగా చూపిస్తోంది. భద్రతా పరంగా ఏ విషయానికి రాజీపడకుండా ప్రతి చిన్న వివరాలను పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రజల భద్రతకే ప్రాముఖ్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది.