Published On:

India Pakistan: భారత్ – పాక్ బలాబలాలు ఇవే!

India Pakistan: భారత్ – పాక్ బలాబలాలు ఇవే!

India Pakistan: భారత్ పాక్ బలాబలాలు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్‌ దాడికి ప్రతిగా చరిత్రలో నిలిచిపోయేలా సమాధానమిస్తామని భారత్‌ హెచ్చరించగా.. భారత్‌ చర్యలకు దీటుగా సమాధాన మిస్తామని పాకిస్థాన్‌ కాలు దువ్వింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైనికులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసి, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించగా.. పాకిస్థాన్‌ సైతం ఉత్తర ప్రాంతానికి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలించింది.
దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం–పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా, పాక్‌ పౌరులెవరూ భారత్‌లో ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు మన దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది. అదే విధంగా పాక్‌ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను బంకర్లలోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. దీంతో భారత్‌.. పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. యుద్ధమే తలెత్తితే సైనికులు, యుద్ధసామాగ్రి పరంగా ఎవరెవరు.. ఏ స్థాయిలో.. ఎంత బలంగా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.

 

భారతదేశం 4వ స్థానంలో, పాక్ 12వ స్థానంలో
గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత సైన్యంలో 14.55 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా.. 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భారత యుద్ధసామాగ్రిలో ఆధునిక, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది.

 

భారతదేశంలో మొత్తం 4,201 ట్యాంకులు ఉండగా.. ఇందులో అర్జున్ ట్యాంక్, టి-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్‌పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అలాగే భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్స్, హోవిట్జర్ తుపాకులు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యంలో 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులతో పాటు.. దాదాపు 3,742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకులు ఉన్నాయి.

 

 

భారత వైమానిక దళం మొత్తం 2,229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. దీనితో పాటు, భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, సుఖోయ్ సు-30ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే, భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలు ఉండగా.. వాటిలో 328 ఫైటర్ జెట్‌లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లూ ఉన్నాయి.

 

భారత నౌకాదళం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంది. భారతదేశం వద్ద 150 యుద్ధనౌకలు ఉండగా.. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, కె-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలాంతర్గాములు ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 1,42,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 ఫ్రిగేట్ యుద్ధనౌకలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ.. భారత నావికాదళం పరిధి, నెట్‌వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది.

 

పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందున్నాం
సైనిక సామర్థ్యం,​సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే, భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్‌వర్క్‌లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ-డొమైన్ యుద్ధ వ్యూహం తదితర అంశాల్లో ముందువరుసలో ఉంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలలో నిరంతరం పెట్టుబడులు పెడుతుండగా.. పాకిస్తాన్ దాని ఆర్థిక వనరులు, సహాయ-ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనుకబడిపోతోంది. మొత్తంగా యుద్ధవిభాగాలైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అన్ని రంగాల్లోనూ భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.