BRS chief KCR : డైరీలో రాసుకోండి.. పోలీసులకు కేసీఆర్ మార్క్ వార్నింగ్

BRS chief KCR : తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి విలన్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 1956లో బలవంతంగా ఏపీతో కలిపింది జవహర్‌లాల్ నెహ్రూ అయితే.. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మొదట జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
కొందరు వెటకారం చేశారు..
వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయలు దేరినట్లు గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బయలు దేరిన సమయంలో కొందరు తనను వెటకారం చేశారని, అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించినట్లు చెప్పారు. ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు తెలంగాణను నంబర్ వన్‌గా తయారు చేసుకున్నామన్నారు. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోసినట్లు గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో తనకు తెలుసని, ఆనాడు కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకొని కూర్చున్నారని ఆరోపించారు. శాసనసభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించొద్దని రూలింగ్ ఇచ్చారన్నారు.
మంచి పథకాలు అమలు చేశాం..
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకం తీసుకొచ్చామన్నారు. రైతుబీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం నిరాటంకంగా అమలైందని చెప్పారు. ఎన్నికల అజెండాలో చెప్పని చాలా పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగావకాశాలు పెరిగేలా చేశామన్నారు. తెలంగాణలో 3 మాత్రమే ఉన్న వైద్య కళాశాలల సంఖ్యను 33కు పెంచామన్నారు.
ఢిల్లీ నకిలీ గాంధీలు ఎన్నో హామీలిచ్చారు..
ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణకు ఇవాళ ఏం బీమారి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు అమలు చేయని హామీలు ఇచ్చారని తెలిపారు. పింఛన్ రూ.2 వేలు ఉంటే కాంగ్రెసోళ్లు రూ.4 వేలు వేస్తామని హామీనిచ్చారని తెలిపారు. తాము రైతుబంధు రూ.10వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని ఒక్క సంతకంతో రద్దు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్నారని, ఇప్పటికీ పింఛన్లు పెరగలేదన్నారు. రుణమాఫీ పూర్తి కాలేదని, ఎన్నో మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.
మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి..
ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. ప్రతి చెడు విషయానికి కేసీఆర్ కారణమని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీల గురించి అడిగితే సంక్రాంతి పండుగ, మార్చి అంటూ గడువులు చెబుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు, మోటర్లు కాలిపోయే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన కరెంట్‌కు ఇవాళ ఏమయిందని అడుగుతున్నారని, భూముల ధరలు ఎందుకు తగ్గాయి? నీళ్లు ఎక్కడికి పోయాయి? వడ్లు కొనే దిక్కులేదు.. కల్లాల్లో రైతులు ఏడుస్తున్నారు. 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇకపై బయటకు వస్తా..
పాలన చేతకాక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని, 80-90శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెసోళ్లు కేసీఆర్ కిట్‌నూ కూడా బంద్ చేశారని, సర్కారుకు కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదని చెప్పారు. ఇక నుంచి బయటకి వస్తానని, అందరి తరఫున పోరాడతానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పనిచేయాలని కోరారు. భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ, ఏది అమ్మాలో విచక్షణ ఉండాలన్నారు. ఎక్కడైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా? అని ప్రశ్నించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీని కొనసాగించా..
ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని తాను ఆనాడే చెప్పానని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను రద్దు చేయలేదన్నారు. పేరు మార్చకుండా పథకాన్ని కొనసాగించినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులకు చెబుతున్నా డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని ఆరోపించారు. 30శాతం కమీషన్లు తీసుకుంటూ సంచులు మోస్తోందన్నారు. అసెంబ్లీకి రావాలని తనకు సవాల్ విసురుతున్నారని, పిల్లలు అడిగితేనే చెప్పే దిక్కులేదన్నారు. తాను కావాలా? కమీషన్ల గురించి అసెంబ్లీలో హరీశ్‌రావు ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు.
ఆపరేషన్ కగార్ ఆపేయాలి..
బీజేపీ వైఖరి అంతా భభ్రమానం.. భజగోవిందం అన్నారు. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు అన్నారు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు. చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారని చెప్పారు. నక్సలైట్లను చర్చలకు పిలవాలని కోరారు. బలగాలు ఉన్నాయని అందరినీ చంపుతూ వెళ్తే ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ఆపాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామన్నారు.