Telangana High Court : హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వల్ప ఊరట.. ఆ కేసులో విచారణ వాయిదా

Telangana High Court : 2024 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని వ్యాఖ్యానించాడు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో తుదితీర్పు వెలువడే వరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రేవంత్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేవంత్ అభ్యర్థన మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా పేర్కొంది. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న కేసుపై స్టేకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణ జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.
ఇది కేసు నేపథ్యం..
2024 మే 5న కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్ల తొలగిస్తామని మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. తాజాగా రేవంత్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి, విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.