Last Updated:

Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

Allu Arjun Gets Relief in Court: హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు మరో ఊరట కల్పించింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షరతులతో బన్నీకి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల్లో సడలింపు ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశిస్తూ రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో గత ఆదివారం అల్లు అర్జున్‌ చిక్కడపల్లికి వెళ్లగా.. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఇబ్బంది వాతావరం కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం స్టేషన్‌ వెళ్లడం సెక్యూరిటీ పరంగా సమస్యలు తలెత్తే అవకావం ఉంది. దీంతో ఇందులో సడలింపు కోరుతూ అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టు మరో పిటిషన్‌ వేశారు. శనివారం ఆయన పిటిషన్‌ను విచారించిన కోర్టు అల్లు అర్జున్‌కి మినహాయింపు ఇచ్చింది. ప్రతి ఆదివారం పోలీసుల స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని బన్నీని కోర్టు ఆదేశించింది.

కాగా గతేడాది డిసెంబర్‌ 5న పుష్ప 2 మూవీ రిలీజ్‌ సందర్భంగా ముందు రోజు బెనిఫిట్‌ షోలు వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు బన్నీ సంధ్య థియేటర్‌కు వచ్చాడు. ఊరేగింపుగా రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో థియటర్‌ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దీంతో అల్లు అర్జున్‌ అక్కడికి రావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని చిక్కడపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయగా.. నాంపల్లి కోర్టు రెగ్యూలర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. బన్నీ రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కు హాజరై సంతకం పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ. 50 వేలు కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ క్రమంలో ఆయన తాజా పిటిషన్‌ని విచారించిన కోర్టు నిబంధనలలో సలింపు ఇచ్చింది.