Published On:

VC Sajjanar appreciates Journalists: మీ సేవలు భేష్.. జర్నలిస్టులకు సజ్జనార్ ప్రశంసలు

VC Sajjanar appreciates Journalists: మీ సేవలు భేష్.. జర్నలిస్టులకు సజ్జనార్ ప్రశంసలు

VC Sajjanar appreciates to Journalists amid India – Pakistan War Coverage: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను హతం చేసింది. అయితే భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. వీటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. చివరికి భారత్ తో యుద్ధం తమకే నష్టమని కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని భారత్ వద్ద ప్రాథేయపడింది. ఇక అమెరికా మధ్యవర్తిత్వంతో ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.

 

కాగా భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. భారత్- పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా నిరంతరం వార్తలు ప్రసారం చేసిన, అందుకు రాత్రింబవళ్లు పనిచేసిన మీడియా జర్నలిస్టులను ఆయన అభినందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

 

ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధులకకుగా ఉంటారని, వారి వృత్తి ఎంతో కఠినమైన సవాళ్లతో కూడుకున్నదని పేర్కొన్నారు. సమాజానికి వారు చేస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసించారు. శత్రుదేశం దాడులు చేసిన ప్రదేశాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి వార్తల ప్రసారం చేయడం సాధారణ విషయం కాదన్నారు.

 

‘నిజాయితీ, ధైర్యం, బాధ్యతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం. సత్యం, ప్రజాసేవ పట్ల మీ నిబద్ధత, తరచుగా వ్యక్తిగతంగా చాలా ప్రమాదంలో ఉన్నా.. దేశానికి సమాచారం ఇస్తున్నారు. ముఖ్యమైన పనిని చేసినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.