Published On:

PM Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ

PM Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ

Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్తాన్ ను తగిన బదులు ఇస్తామని చెప్తూనే ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య, పరస్పర సంబంధాలను తెంచుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులను, పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. అలాగే పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలను భారత జలాల్లోకి, పోర్టుల్లోకి నిషేధించింది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది.

 

మరోవైపు ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్ తో కలిసి పనిచేస్తామని ఇప్పటికే పలుదేశాలు తెలిపాయి. అలాగే భారత్ కు తమ సహకారం ఉంటుందని వెల్లడించాయి. అయితే ఇన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత్.. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో పలువురు ముష్కరులు హతమయ్యారు.

 

ఈ నేపథ్యంలోనే పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమై వివరించారు.

 

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకుగాను కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను తెలపనుంది. సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు హాజరుకానున్నారు.