Bengaluru: పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

Police: భారత్- పాకిస్తాన్ మధ్య కొద్ది రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది.
దీంతో పాకిస్తాన్ దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. అయితే భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు, ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి పోస్టులు పెట్టొద్దని నెటిజన్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్ట్ పెట్టిన ఓ మెడికల్ స్టూడెంట్ పై కర్నాటకలోని విజయ్ పుర పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను నివసిస్తున్న హాస్టల్ వెలుపల పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశాడనే ఆరోపణలతో శుభాన్షు శుక్లా అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిది ఛత్తీస్ గఢ్ గా గుర్తించారు. శుక్లా బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు.
మొదటగా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గత సోమవారం విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ మే 11న బెంగళూరులోని ప్రశాంత్ లే అవుట్ లోని తన పీజీ హస్టల్ లోని బాల్కనీలో నిలబడి పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.