Trump: భారత్- పాక్ మధ్య నేను మాట్లాడలే.. ట్రంప్ యూటర్న్

India- Pakistan War: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్ యుద్ధం తాను ఆపలేదని.. అమెరికాది పరోక్ష పాత్ర మాత్రమేనని.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక చర్చల వల్లే కాల్పుల విరమణ జరిగిందన్నారు. కాగా ఖతార్ లోని దోహాలో జరిగిన వాణిజ్య సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. దీంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఆర్మీని ఉద్దేశించి ట్రంప్ ఇవాళ మాట్లాడారు. ” నేను భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం లేదు కానీ.. కచ్చితంగా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాను” అన్నారు. రెండు దేశాలు క్షిపణులతో దాడులు చేసుకున్నాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో పరోక్ష పాత్ర పోషించానని చెప్పారు. ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, రెండు దేశాలు వాణిజ్యంపై దృష్టిపెట్టాలని చెప్పానని తెలిపారు. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ చాలా హ్యాపీగా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు.
కాగా భారత్, పాక్ కాల్పుల విరమణకు ముందు ట్రంప్ మాట్లాడారు. “భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. రెండు దేశాలు నా మాట విని యుద్ధాన్ని ఆపాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య అణుబాంబులతో యుద్ధం చేసే స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని.. నా మధ్యవర్తిత్వంతో అణు విధ్వంసాన్ని ఆపాను” అని ప్రకటించారు.