ISRO: రేపటి నుంచి పీఎస్ఎల్వీ- సీ61 కౌంట్ డౌన్.. ఎల్లుండి రాకెట్ ప్రయోగం

PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈనెల 18న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రేపు ఉదయం 7.59 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. కాగా ఇస్రోకు ఇది 101వ ప్రయోగం. ఈ ప్రయోగంతో భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్- 18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
సుమారు 22 గంటల కౌంట్ డౌన్ తర్వాత ఈనెల 18న ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహంలో అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగించారు. దేశంపై నిఘా, పర్యవేక్షణ కార్యకలపాలను మెరుగుపరచనుంది. సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది. సుమారు 1710 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని భూమికి 529 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. అలాగే శుత్రదేశాల కదలికలను కూడా పరిశీలించనుంది.