Indus treaty : పాక్ కాళ్లబేరం.. సింధూ జలాలపై పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు లేఖ

Pakistan’s letter to India : ఇప్పుడు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలివేయడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్‌కు జరిగిన నష్టం గురించి ఇప్పుడు తెలుసొచ్చింది. మొన్నటి వరకు సింధూ జలాల అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినా సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రకటించింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి పాక్ లేఖ రాసింది.
వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ప్రకటించిన మోదీ..
సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందని భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆ దేశ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. సింధూ జలాల విషయంలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఇదే అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై అని పేర్కొన్నారు.
ఏమిటీ ఒప్పందం..?
పహల్గామ్‌లో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించింది. సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. ఒప్పందంపై అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధూ ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులు జీలం, చీనాబ్‌పై పాక్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.