Draupadi Murmu : ఈ అధికారం మీకెవరు ఇచ్చారు..? సుప్రీంకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న

President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు..
-రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీం తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?
-సుప్రీంకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వియోగం చేస్తున్నాయా?
-రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటని రాష్ట్రపతి ప్రశ్నించింది.
-ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
తీర్పు నేపథ్యం..
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్‌ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని తెలిపింది. తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.