Operation Sindoor : మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు నమోదు చేయండి.. ఆ రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం

Madhya Pradesh High Court : భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, రెండు దేశాలు యుద్ధం ప్రకటించాయి. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్ స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రిపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నాలుగు గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆ రాష్ర్ట డీజీపీని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షమ శాఖ మంత్రి విజయ్ షా మాట్లాడారు. సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ పేరును పరోక్షంగా ప్రస్తావించి విమర్శలు చేశారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువులను చేశారని, వాళ్ల ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మన ప్రధాని మోదీజీ పంపించి గుణపాఠం నేర్పించారని మాట్లాడారు. దీంతో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం దరదృష్టకరమని పేర్కొంది.