Nitin Gadkari Shocking Comments: దేశ రాజధాని ఢిల్లీలో మూడ్రోజులుంటే జబ్బు చేయడం ఖాయం: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Shocking Comments on Delhi Weather: ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండటంపై కేంద్రమంత్రి నితిక్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. కాలుష్యంలో ఢిల్లీ, ముంబయి రెడ్‌జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల ఆయూష్ 10 ఏళ్లు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మేల్కొని వాహన ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
పర్యావరణాన్ని ఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలి..
రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తామో అలాగే పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలని సూచించారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పనిచేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణం అన్నారు. వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమని చెప్పారు. మనం దాదాపు రూ.22లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని, వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్ రావాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెడుతోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే మన ఖర్చులు 16శాతం వరకు ఉన్నాయని, 2026 చివరి నాటికి వాటిని సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
20 నగరాల్లో 13 భారత్‌లోనే..
స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ విడులలైంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం వెలువడే 20 నగరాల్లో ఇండియాలోనే 13 ఉన్నాయి. అస్సాంలోని బైర్నీహాట్ నగరం తొలిస్థానంలో నిలువగా, తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ఇతర నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు నివేదిక తెలిపింది. కాలుష్యంతో ఢిల్లీ ప్రజల ఆయూష్ 5.2 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేసింది. 2009 ఏడాది నుంచి 2019 మధ్య ఇండియాలో ఏటా కాలుష్య సంబంధిత వ్యాధుల వల్ల 1.5 మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గతేడాది విడులైన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం పేర్కొంది.