Disha Patani : చిన్నారిని రక్షించిన బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని సోదరి

Disha Patani : మానవత్వం కనుమరుగవుతున్న వేళ, సొంత పిల్లలే తల్లిదండ్రులకు భారమైన వేళ, తానున్నానంటూ బిక్కుబిక్కుమంటున్న మట్టిలో పడివున్న చిన్నారిని రక్షించారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి, మాజీ ఆర్మీ ఆఫీసర్ కుష్బూ పటాని. ఆదివారం ఉదయం కుష్బూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు. అందులో ఓ మూడేళ్ల చిన్నారి తన ఇంటి పక్కనున్న మట్టి దిబ్బలో పడి ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఆ చిన్నారిని చేరదీసిన ఆవిడ మెడికల్ ఎమర్జెన్సీతో పాటు ఆహారాన్ని అందించారు.
చిన్నారిని రక్షించిన బాలీవుడ్ హీరోయిన్ సోదరి
చిన్నారి దీనస్థితిపై చలించిన కుష్బూ పటాని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. అందులో ఆవిడ, బాలికల రక్షణపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడేళ్ల చిన్నారిని తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లినట్లుగా తెలిపారు. బాలిక ఉన్న స్థితిని చూసి తాను చాలా ఆవేదనకు గురైనట్లు చెప్పారు. విశయం తెలుసుకున్న పోలీసులు బాలికను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలికా సంరక్షణా కేంద్రానికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
మట్టిలో కూరుకుపోయిన చిన్నారి
‘save the girl child’ అంటూ పిలుపునిచ్చారు కుష్బూ పటాని. సోషల్ మీడియాలో ఆవిడ రిలీజ్ చేసిన వీడియోకు ప్రధాని మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, యూపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. అదికారులు చిన్నారికి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలని కోరారు. “ఈ దేశంలో బాలికలు రక్షించబడాలి. ఎప్పటివరకు ఈ దారుణాలు. దయచేసి ఈ చిన్నారికి మంచిభవిష్యత్తును ఇవ్వండి. చిన్నారి భవిష్యత్తు ఉన్నతమైనదిగా ఉండాలని శ్రీ కృష్ణ భగవానున్ని కోరుతున్నా” అంటూ ట్వీట్ చేశారు.
తక్షణమే స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు
ఘటనపై బలేలీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పంకజ్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం కుష్బూ పటాని జాగింగ్ వెళ్లి తిరిగి వస్తుండగా ఆవిడ ఇంటి సమీపాన మూడేళ్ల చిన్నారిని గమనించిందని తెలిపారు. శరీరం మొత్తం మట్టితో పేరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న చిన్నారిని చూసిందని చెప్పారు. వెంటనే ఆ చిన్నారికి తక్షణ సేవలు అందించారని తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే పాపను చిన్నారుల రక్షణా కేంద్రానికి తీసుకెళ్లామని ప్రస్తుతం పాపకు వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం పాప సురక్షితంగా ఉందని చెప్పారు. కుష్బూ ఇంటి సమీపంలో చిన్నారి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని బరేలీ పోలీస్ ఆఫీసర్ శ్రీవాత్సవ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.