Published On:

Namo Bharat train : ఈ రైలు ఫీచర్లు తెలుసా?… తొలిసారి 16 కోచ్‌లతో నమో భారత్‌ రైలు.. 24న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Namo Bharat train : ఈ రైలు ఫీచర్లు తెలుసా?… తొలిసారి 16 కోచ్‌లతో నమో భారత్‌ రైలు.. 24న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Namo Bharat train : దేశంలో 16 బోగీలతో మొదటి నమో భారత్‌ ర్యాపిడ్‌ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిహార్‌లోని జయ్‌నగర్‌-పట్నా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడువనున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్‌ రైలు గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌-భుజ్‌ స్టేషన్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రైల్లో 12 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించగా, తాజాగా 16 కోచ్‌లతో కొత్త ట్రైన్‌ను సిద్ధం చేశారు.

 

అధునాతన సౌకర్యాలతో..
అధునాతన సౌకర్యాలతో నమో భారత్‌ రైలును తీర్చిదిద్దారు. ఈ రైలును ప్రధాని మోదీ గురువారం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వే బోర్డు అధికారి దిలీప్‌ కుమార్‌ తెలిపారు. 16 కోచ్‌లతో నడిచే మొదటి నమో భారత్‌ రైలు ఇదేనని చెప్పారు. ఈ ట్రైన్ గరిష్ఠంగా 110కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుందని చెప్పారు. వివిధ అవసరాల కోసం పట్నా వైపు వెళ్లే ఉత్తర బిహార్‌లోని ప్రజలకు సౌకర్యమంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ రైల్లో అన్నీ ఏసీ కోచ్‌లేనని తెలిపారు. 2 వేల సీటింగ్‌ సామర్థ్యంతో రైలు నడుస్తుందని చెప్పారు. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చని తెలిపారు. రైల్లో నిలబడినవారు బ్యాలెన్స్‌ కోల్పోకుండా హ్యాండ్‌ రెయిల్స్‌, స్తంభాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

 

మధుబని, సక్రీ, దర్భంగా, సమస్థిపుర్‌, బరౌని, మొకమ స్టేషన్ల మీదుగా ఈ రైలు నడువనున్నది. రైల్లో ప్రయాణికులు కూర్చొనేలా సీట్లను సైతం ఏర్పాటు చేశారు. టైప్‌-సి, టైప్‌-ఎ ఛార్జింగ్‌ పాయింట్లతో పాటు పూర్తిస్థాయిలో ఏసీ క్యాబిన్‌లు, మాడ్యులర్‌ ఇంటీరియర్స్‌, టాయిలెట్స్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. కవచ్‌ భద్రతా వ్యవస్థ, సీసీ టీవీలు, అగ్నిప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థ, రెండు వైపులా ఇంజిన్లు (పుష్‌-పుల్‌), రైలు చేరుకొనే ప్రతి స్టేషన్‌ సమాచారాన్ని ప్రదర్శించే రూట్‌మ్యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి: