Published On:

Thudarum Trailer: మరో కొత్త కథతో వస్తున్న మెగాస్టార్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా

Thudarum Trailer: మరో కొత్త కథతో వస్తున్న మెగాస్టార్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా

Thudarum Trailer: ఈమధ్యకాలంలో మలయాళ ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతుంది. కొత్త కొత్త కథలు.. కొత్త కొత్త హీరోలను పరిచయం చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటుంది. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

 

ఇక మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్  వరుస సినిమాలతో  బిజీగా మారాడు. విజయాపజయాలను పక్కన పెడితే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం తుడరుమ్. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన శోభన నటిస్తుంది. ఈ జంట కలిసి నటించి చాలాకాలం అయ్యింది.

 

1987 తరువాత మోహన్ లాల్, శోభన స్క్రీన్ పై సందడి చేసింది  లేదు. ఇన్నేళ్ల తరువాత ఈ జంట స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అలరించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించాడు. ఆ కారే తన జీవితం అన్నట్లుచూపించారు. ఆ కారును సొంత బిడ్డలా చూసుకుంటూ కనిపించాడు.

 

ఇంకోపక్క మంచి భర్తగా.. శోభనతో చిలిపి పనులు చేస్తూ, పిల్లలతో కలిసి ఆడుకొనే తండ్రిగా చూపించారు. అయితే సడెన్ గా  తన బిడ్డ లాంటి కారును పోలీసులు తీసుకెళ్లడం, ఆ కారును వెనక్కి తీసుకొచ్చుకోవడానికి మోహన్ లాల్ ఏం చేశాడు.. ?  అస్సలు కారును పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు..? చివరికి కారు మోహన్ లాల్ చేతికి వచ్చిందా.. ? అనేది కథగా తెలుస్తోంది. మోహన్ లాల్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.

 

దృశ్యం లాంటి సినిమాలో ఎంతో అల్లరిగా తిరిగే ఒక తండ్రి.. కూతురుకు కష్టం వస్తే ఎలా డీల్ చేశాడు ..? అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూతురు స్థానంలో కారు  ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఆ కారు కోసం మోహన్ లాల్ ఏం చేశాడు అనేది చూడాలి. ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 25 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మోహన్ లాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.