PM Modi : సౌదీ అరేబియా పర్యటకు ప్రధాని మోదీ.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్ జెట్లు

Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున ఆరు జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోదీ ట్వీట్..
సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ఇటీవల ఇరుదేశాల మధ్య బంధం మరింత దృఢమైందని చెప్పారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం ప్రమోట్ చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మూడోసారి మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. మోదీ జెడ్డాకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండో స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని పాల్గొనున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ అరేబియా చక్రవర్తి మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు.