CM Revanth Reddy: అందుకే డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy Comments On Delimitation: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని, ఈ ఘనత తమిళనాడు సీఎం స్టాలిన్‌దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులోని చెన్నై వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కుటుంబ నియంత్రణ విజయం చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, అయినప్పటికీ నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
ఇక, కేంద్రానికి తమిళనాడు రూపాయి పన్ను చెల్లిస్తే.. 26 పైసలే వెనక్కి వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే, రూపాయికి తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారని, కానీ బీహార్ రూపాయి చెల్లిస్తే.. ఆరు రూపాయలు ఇస్తున్నారన్నారు. యూపీకి రెండు రూపాయలు, కర్ణాటలో రూపాయికి 16 పైసలు, కేరళకు 49 పైసలు, మధ్యప్రదేశ్‌కు రూ.1.73 ఇస్తున్నారన్నారు. అందుకే కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ సీట్లను పెంచకుండా డీలిమిటేషన్ చేయాలన్నారు. ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్ ఈ విధానాన్ని అమలు చేశారని గుర్తుచేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే.. దక్షిణాది రాష్ట్రాల వాయిస్ పార్లమెంట్‌లో ఉండదని, మనల్ని ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తారన్నారు.