Summer Holidays: అంగన్వాడీలకు బిగ్ అప్డేట్.. రేపటి నుంచి సెలవులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. మే 1 నుంచి జూన్ 1 వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. దీంతో ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయింది. మరోవైపు ఎండల ప్రభావంతో గర్భిణీలు, బాలింతలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారు. ఈ విషయమై పలువురు వర్కర్లు ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు.
ఈ విషయమై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో ఇవాళ ఉన్నతాధికారులతో, అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశం నిర్వహించారు. ఎండలు అధికంగా ఉన్న కారణంగా మే నుంచి సెలవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించింది.
కానీ అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా సరుకులు, గుడ్లు పంపిణీ చేయనున్నారు. సెలవుల కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇంటింటి సర్వే, హోం విసిట్స్, అంగన్వాడీలో చేర్పించాల్సిన పిల్లలను గుర్తించడం వంటి పనులు విధిగా చేయాలని టీచర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిండంపై అంగన్వాడీ యూనియన్లు మంత్రి సీతక్కకు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.