Published On:

KTR : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రానికి శాపంగా మారాయి : కేటీఆర్ ఆగ్రహం

KTR : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రానికి శాపంగా మారాయి : కేటీఆర్ ఆగ్రహం

BRS Working President KTR : రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడిక్కెంది. ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించామని, తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవం‌త్‌రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని ముఖ్యమంత్రి అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని విమర్శించారు.

 

ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి నేతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు బాధాకమన్నారు. రేవంత్ మాట్లాడిన తీరు ఆయన పాలనాపరమైన అనుభవం లేకపోయిన దాని సూచనగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని చెప్పినా ప్రజలు వినలేదన్నారు. సీఎం రేవంత్ మాటలు దివాలా కోరివానిలా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు కీలక పాత్ర పోషించారని తెలిపారు. వారి పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు.

 

తమ హయాంలో రూ.4.15 లక్షల కోట్ల అప్పు చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి విరమించిన సమయంలో తెలంగాణ ఆదాయం నెలకు రూ.18 వేల కోట్లు ఉందని వివరించారు. ఇప్పుడు అదే ఆదాయం వస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కాకి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఒకసారి రూ.6 లక్షల కోట్లు, తర్వాత 8.29 లక్షల కోట్లు అంటూ లెక్కల్లో అస్పష్టత ఉన్నదని చెప్పారు.

 

రైతుబంధు, 24 గంటల కరెంట్, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో బీఆర్ఎస్ హయాంలో స్థిరత ఉందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అన్నిరంగాల్లో సంక్షోభం నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల ముందుకు విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆర్థికంగా గాడిలో పెట్టిన కేసీఆర్ పాలన తర్వాత ఇప్పుడు పరిస్థితులు గందరగోళంగా నెలకొన్నాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

 

ఇవి కూడా చదవండి: