Mock Drills: దేశవ్యాప్తంగా అలర్ట్.. రేపు అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్

Central Government Order for Mock Drill Tomorrow: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ చేసింది. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా దేశంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హోం శాఖ కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రేపటి మాక్ డ్రిల్ ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల అధికారులతో హోం శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ మేరకు సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. కాగా, అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై చర్చించారు. అనంతరం సీఎస్‌లు, పౌరరక్షణ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఇందులో హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మాక్ డ్రిల్ 1: మాక్ డ్రిల్ 1 అనగా ఎయిర్ రైడ్ సైరన్ మోగించనున్నారు. పట్టణాలు, నగరాల్లో వార్ సైరన్ల మోతలు వినిపించనున్నారు. ఇందులో సైరన్లను పరీక్షించడం, యాక్టివేట్ చేయడం వంటి పనులు చేస్తారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి సైరన్లు మోగించనున్నారు.
మాక్ డ్రిల్ 2: మాక్ డ్రిల్ 2లో ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు. దాడులు జరిగిన సమయంలో ప్రజలకు సూచనలు ఇవ్వనున్నారు. స్కూళ్లు, ఆఫీసులు, కమ్యూనిటీ సెంటర్లలో వర్క్ షాప్‌లు నిర్వహించనున్నారు. అలాగే దగ్గరున్న షెల్టర్లను గుర్తించడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు చేసుకోవడం, తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ప్రశాంతంగా ఉండేలా శిక్షణ ఇవ్వనున్నారు.
మాక్ డ్రిల్ 3: మాక్ డ్రిల్ 3లో బ్లాక్ అవుట్ల నిర్వహణ ఉంటుంది. రాత్రి సమయాల్లో శత్రుదేశ వైమానిక దాడులను ఎదుర్కొనే చర్యలు చేపట్టనున్నారు. నగరాల్లో అకస్మాత్తుగా బ్లాక్ అవుట్లు వస్తే ఏం చేయాలనే విషయాలను తెలియజేయనున్నారు. ఇందులో శత్రువు మనల్ని గుర్తించకుండా లైట్లు ఆర్పడం వంటి పనులపై అవగాహన కల్పించనున్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఉపయోగించిన వ్యూహాన్ని మళ్లీ తీసుకొచ్చారు.
మాక్ డ్రిల్ 4: మాక్ డ్రిల్ 4లో కీలక భవనాలను కాపాడుకోవడం, వ్యూహాత్మక నిర్మాణాలను సంస్థల కోసం ఏర్పాట్లు చేయనున్నారు. శత్రువు వీటిని గుర్తించకుండా కప్పేయడం వంటి చర్యలు ఉంటాయి. అలాగే పాక్ శాటిలైట్లు, గస్తీ విమానాలు గుర్తించకుండా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మిలటరీ స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లు ఉండనున్నాయి.
మాక్ డ్రిల్ 5: మాక్ డ్రిల్ 5లో ప్రజలను ఖాలీ చేయించడంతో పాటు హైరిస్క్ జోన్ల నుంచి జనాలను తరలించడం ఉంటుంది. ఇందుకోసం సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే ఆపరేషన్ చేయనున్నారు.