Published On:

Kesineni Brothers: పేరుకే అన్నదమ్ములు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది

Kesineni Brothers: పేరుకే అన్నదమ్ములు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది

Kesineni Brothers:   పేరుకే అన్నదమ్ములు.  వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, ట్వీట్‌కు రీట్వీట్‌‌తో ఇరువురి మధ్య వార్ నడుస్తోంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన కేశినేని సోదరులిద్దరూ..  ఎన్నికల వేళ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం కేశినేని నాని వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే తాజాగా అధికారంలో ఉన్న తన సోదరుడు చిన్నిని టార్గెట్ చేస్తూ కేశినేని నాని విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

తాజాగా కేశినేని బ్రదర్స్‌ మధ్య వివాదానికి విశాఖలో ఉర్సా క్లస్టర్స్‌ కంపెనీకి కేటాయించిన భూముల వ్యవహారం కేంద్రంగా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు విశాఖలోని ఐటీ పార్క్‌, కాపులుప్పాడ వద్ద 60 ఎకరాలను కేటాయించింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఊరు, పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని ఎలా అప్పగించిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంపైనే సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ కూడా రాశారు. ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపుల ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

 

ఉర్సా క్లస్టర్స్‌ కంపెనీకి భూములు కేటాయింపులపై సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాలను ఎక్స్‌ వేదికగా కేశినేని ట్వీట్‌ చేశారు. ఉర్సా కంపెనీని కేశినేని చిన్నికి చెందిన బినామీ కంపెనీగా ఆరోపణలు చేశారు. డేటా సెంటర్‌ ఏర్పాటులో ఎటువంటి అనుభవం లేని ఉర్సా కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేశినేని చిన్ని.. తన స్నేహితుడితో కలిసి నెలలు నిండని కంపెనీ ద్వారా వేల కోట్ల అవినీతికి తెరతీశారని ఆరోపించారు. అలాగే వీరిపై ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కుమ్మక్కై, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు.

 

అయితే కేశినేని నాని లేఖకు.. అంతే ఘాటుగా కేశినేని చిన్ని రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కేశినేని చిన్ని కౌంటర్ ఎటాక్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. విదేశీ కంపెనీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేశినేని చిన్ని మండిపడ్డారు. పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంలోనే విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు. అంతే కాకుండా కేశినేని నానిపై వంద కోట్ల పరువునష్టం దావా వేశారు. దీనిపై నాని స్పందిస్తూ లక్ష కోట్లకు దావా వేసినా.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల సంపదను దోచుకునే వారిపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.