Chandrababu : ధ్వంసమైన ఏపీని మళ్లీ గాడిలో పెట్టాం : సీఎం చంద్రబాబు

Chandrababu : 2047 ఏడాది నాటికి మన దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇవాళ శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 2047 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అప్పటి వరకు 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలని ఆకాక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధిరేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. వికసిత్ భారత్-2047ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు.
ధ్వంసమైన ఏపీని మళ్లీ గాడిలో పెడుతున్నామని తెలిపారు. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విజన్ 2020 తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పది సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రంగాల వారీగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాల వారీగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తామని స్పష్టంచేశారు. రాళ్లసీమ ఎడారిగా మారిపోతుందని అనుకున్నారని, కానీ రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని చంద్రబాబు పునర్ఘటించారు.
ఎన్ని భాషలైన నేర్చుకుంటాం
భాష అనేది కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మాతృభాషతోనే విజ్ఞానం వస్తుందని వ్యాఖ్యానించారు. భాషపై లేనిపోని రాజకీయాలు చేయడం తగదన్నారు. భాష అనేది ద్వేషించడానికి కాదని తెలిపారు. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటామని స్పష్టంచేశారు. కానీ మాతృభాషను మరిచిపోకూడదని సీఎం తెలిపారు.