Chandrababu : నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది ఇండియాలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
జాతీయ రహదారుల అభివృద్ధి..
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతోలతో కనిపించేవి అని గుర్తుచేశారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. సంపద సృష్టించి, ప్రజలకు అందించాలని కోరారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
రైతుల ఆదాయం రెట్టింపు..
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటానని, అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని గుర్తుచేశారు. అందులో తెలుగువాళ్లే అధికంగా ఉన్నారన్నారు. తన ఆలోచన ఒక్కటే.. మనం బాగుంటేనే చాలదని, తిరిగి సమాజానికి ఇవ్వాలని సీఎం అన్నారు.
పశువులకు గోధార్‌పై కసరత్తు చేయాలి..
మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌పై కసరత్తు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. మనుషులకు ఆధార్ మాదిరిగానే పశువులకు కూడా గోధార్‌ను తీసుకువస్తున్నట్లు స్టార్టప్ కంపెనీలు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం ఆసక్తి చూపారు. తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి జిల్లాల్లోని అన్ని పశువులకు గోధార్ అనుసంధానం చేయాలని సూచించారు. కోళ్లకు వచ్చే వ్యాధులను గుర్తించటం, ఆరోగ్య విషయాలు తెసుకోవడానికి ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్టార్టప్ కంపెనీలను కోరారు.