Published On:

Donation for Army: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్

Donation for Army: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్

AP Speaker Ayyanna Patrudu Donate 1 month salary to Indian Army: ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సైనికులకు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం ఆర్మీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతం జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా విరాళాన్ని అందజేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన సాయుధ దళాలు ఉగ్రవాద నిర్మూలనలో చూపిస్తున్న ధైర్యం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. దేశ కోసం పోరాడుతున్న జవాన్లకు తనవంతుగా నెల జీతం రూ.2.17లక్షలు జాతీయ రక్షణ నిధికి అందజేసినట్లు తెలిపారు. దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న కృషి దేశ ప్రజలందరిలో జాతీయ భావనను పెంపొందించాలని పేర్కొన్నారు.

 

జవాన్ల కోసం పూజలు..

‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని ఏపీలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖలోని మురళీనగర్‌లో వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మొక్కుకున్నారు. భారత సైనికులు, ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు శారీరక శక్తితో పాటు మనోధైర్యం ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. భారత్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాక్ ఇండియా పౌరులపై దాడులు చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ముష్కరులపై యుద్ధంలో ఇండియా విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

 

భారత్ విశ్వగురువుగా మారాలి..

భారత సైన్యానికి విజయం చేకూరాలని భీమవరం దేవాలయాల్లో పూజలు చేశామని ఎంపీ పాకా సత్యనారాయణ తెలిపారు. తీవ్రవాదాన్ని అణచివేసే ధర్మపోరాటంలో భారత్ తరఫున ప్రపంచం మద్దతు తెలుపుతుందన్నారు. ఆధ్యాత్మిక శక్తి, దైవ బలం ఇండియాకు అందాలన్నారు. ధర్మ యుద్ధంలో భారత్ విశ్వగురువుగా నిలబడాలని ఎంపీ ఆకాంక్షించారు. కడప జిల్లాలోని గండి ఆంజనేయస్వామి ఆలయంలో రిటైర్డు ఆర్మీ జవాన్లు, బీజేపీ నేతలు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: