Vallabhaneni Vamsi : షరతులు వర్తిస్తాయి.. వల్లభనేని వంశీతోపాటు మరో నలుగురికి బెయిల్

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. వంశీ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం రెండుసార్లు బెయిల్ తిరస్కరించింది. దీంతో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇటీవల ఇరువర్గాల తరఫు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. మంగళవారం సాయంత్రం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. కేసులో వల్లభనేని వంశీతోపాటు మరో నలుగురు నిందితులకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది.
వంశీపై ఆరు కేసులు..
వల్లభనేని వంశీ మొదట సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు కాగా, తర్వాత వంశీపై వరుసగా మరిన్ని కేసులు నమోదైయ్యాయి. వంశీపై 6 కేసులు పెట్టారు. ఆరు కేసుల్లో నమోదు కాగా, ఐదు కేసుల్లో ముందస్తు బెయిల్ పొందారు. కానీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ రాలేదు. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చిన వంశీ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.