CM Chandrababu : ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఆరు ఎస్‌ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దాదాపు లక్ష్లల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్‌ఐపీబీ సమావేశం..
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్‌ఐపీబీ సమావేశం ముగిసింది. 19 ప్రాజెక్టులకు రూ.33వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకువచ్చాయి. ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని అధికారులను ఆదేశింంచారు.
టూరిజం సెక్టార్‌లో హోటళ్లు, గదుల కొరత ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. పెద్దఎత్తున హొటల్ రూమ్‌లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందని వ్యాఖ్యానించారు. 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. హోటల్ గదుల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు బస చేస్తారని వెల్లడించారు.