Donald Trump : ట్రంప్ విధానాలపై ప్రజలు ఆగ్రహం.. ‘అమెరికాలో రాజులు ఎవరూ లేరు’

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ఆ దేశ ప్రజలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ట్రంప్ పాలనపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నగర వీధుల్లోకి వచ్చి ఫ్లకార్డులతో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వలసదారులకు స్వాగతం..
న్యూయర్క్‌లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల ప్రజలు గుమిగూడి నినాదాలు చేశారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించాలని ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకు ఉన్న చట్టపరమైన నివాస హోదాను ట్రంప్ సర్కారు రద్దు చేసింది. వలసదారులను బహిష్కరించారు. దీంతో ఆందోళనకారులు మండిపడ్డారు. ఎలాంటి భయం లేదని, వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ట్రంప్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఎఫ్-1 విద్యార్థి వీసా ముగిసినా..
ఎఫ్-1 విద్యార్థి వీసా ముగిసినా పాలస్తీనాకు చెందిన విద్యార్థి అమెరికాలోనే ఉంటున్నాడు. దీంతో విద్యార్థిని లెకా కోర్డియాను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. మరో పాలస్తీనా విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ పనితీరును నిరసిస్తూ ఇటీవల అమెరికా ప్రజలు దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్ నుంచి అలస్కా వరకు వీధుల్లో ప్రజలు పోటెత్తి హ్యాండ్సాఫ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికాలో రిపబ్లికన్ల పాలన ప్రారంభమైన తర్వాత జరిగిన అతి పెద్ద నిరసనగా నిలిచింది.
ఆందోళనకు భారీ స్పందన..
పౌర హక్కుల, కార్మిక సంఘాలు, ఎల్‌జీబీటీక్యూ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్, ఎన్నికల సంస్కరణల సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన హ్యాండ్సాఫ్ ఆందోళనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాజాగా మరోసారి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.