PM Modi: భారత్- పాక్ దాడులు.. త్రివిధ దళాలతో ప్రధాని కీలక భేటీ

IND- PAK War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. వీటిని భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అలాగే భారత్ లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. వీటిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. కాగా భారత్ లోని సైనిక స్థావరాలు, ప్రార్థనా మందిరాలు, ఎయిర్ పోర్టులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేయొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ను అమలు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో రాత్రిళ్లు కరెంట్ సరఫరాను నిలిపివేస్తోంది. అలాగే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలను ఆర్మీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ కీలక భేటీ జరిగింది. సమావేశంలో భారత త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కాగా పాకిస్తాన్ నిన్న చేసిన దాడులు, భారత్ వాటిని ఎదుర్కోన్న విషయాలను ప్రధానికి అధికారులు వివరించారు. అయితే దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.