Published On:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. స్పందించిన ప్రపంచ దేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. స్పందించిన ప్రపంచ దేశాలు

World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం.

 

కాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు త్వరగా ముగిసిపోవాలని పలు దేశాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

యుద్ధం ఎవరూ కోరుకోరు: అమెరికా

భారత్ జరిపిన దాడులపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు ముగిసిపోవాలన్నారు. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు అని చెప్పారు. కాగా భారత్, పాక్ మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో పోస్ట్ చేశారు.

 

దాడులతో ఆందోళన చెందుతున్నాం: చైనా

పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడులు విచారకరమని చైనా అభిప్రాయపడింది. భారత్, పాక్ రెండూ తమకు పొరుగు దేసాలని, తాము ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. శాంతి, స్థిరత్వం కోసం భారత్, పాక్ కృషి చేయాలని.. పరిస్థితిని మరింత జఠిలం చేయకుండా చూడాలని కోరింది.

 

రెండు దేశాలు సంయమనం పాటించాలి: ఐక్యరాజ్యసమితి

పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. భారత్, పాకిస్తాన్ శాంతియుతంగా నడుచుకోవాలని యూఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కోరారు.

 

భారత్ కు తమ మద్దతు ఉంటుంది: ఇజ్రాయెల్

ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు భారత్ కు ఉంటుందని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పోస్ట్ చేశారు. ఆత్మరక్షణ కోసం భారత్ చేస్తున్న దాడులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అమయాకుల ప్రాణాలు తీసీ దాక్కొవడం ఉగ్రవాదులకు సిగ్గుచేటని తెలిపారు.

 

శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి: యూఏఈ

భారత్- పాక్ మధ్య దాడులను ప్రపంచం భరించలేదని యూఏఈ తెలిపింది. ఇరుదేశాలు శాంతి పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఉప ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

 

దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం: టర్కీ, అజర్ బైజాన్

పాకిస్తాన్ లో భారత సైనిక దళాలు జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టర్కీ, అజర్ బైజాన్ దేశాలు ప్రకటించాయి. దాడుల్లో ఎందరో అమయాకపు ప్రజలు మృతిచెందారని.. దీనిని ఎంత మాత్రం సహించమని పేర్కొన్నాయి. మృతులకు తమ నివాళులు తెలుతున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రకటించాయి.