Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు

Shamshabad Airport : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వేళ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. విమానాశ్రయంలో బాంబు పెట్టమంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. 24గంటల పాటు డేగ కన్నుతో ఎయిర్ పోర్టుకు భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసుల సమన్వయంతో ఎయిర్ పోర్టుకు భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శ్రీనగర్, అమృత్‌సర్, బోధ్‌పుర్, చండీగఢ్, రాజ్‌కోట్ వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు.
గురువారం రాత్రి ఇండియా భూభాగంలో దాడులు చేసేందుకు పాక్ యత్నించింది. దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో ఇండియా సైన్యం ప్రతి దాడులకు దిగి పాక్ భూభాగంలోకి దూసుకుపోయింది. కరాచీ, ఇస్లామాబాద్‌లోని పాక్ రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. భారత్ మెరుపు వేగంతో చేసిన భీకర దాడులకు పాక్‌కు దిమ్మతిరిగిపోయింది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియా వ్యూహాత్మకంగా చేపట్టిన దాడులకు పాక్‌లోని సామాన్యులతోపాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ పాక్ పార్లమెంటులో కన్నీరు పెట్టుకున్నారు. అధికార పార్టీ ఎంపీ ఇక్బాల్ పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో ఇండియా దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారై సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.