Published On:

Employment crisis in USA: రోజుకో కొత్త నిబంధన.. అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగుల్లో భయం!

Employment crisis in USA: రోజుకో కొత్త నిబంధన.. అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగుల్లో భయం!

Employment crisis in USA, big shock to H1B visa holders: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం కంటిమీద కునుకులేకుండా పోతోంది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రోజుకో కొత్త నిబంధన తీసుకువచ్చి అటు యాజమాన్యాలకు.. ఇటు ఉద్యోగులకు ముప్పు తిప్పులు తెచ్చిపెడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో హెచ్‌1బీ వీసాలపై అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా లాంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యగులు అభద్రతా భావానికి గురవుతున్నారు. మనశ్శాంతి కరువైంది. దీతో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో అని భయంతో వణికిపోతున్నారు.

అమెరికాలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచమంతా చర్చించుకుంటున్నారు. అమెరికాలో ఉండే ఇతర దేశాలకు చెందిన పౌరులను వెంటనే వారి వారి దేశాలకు పంపించివేయాలని తీసుకున్న నిర్ణయం పలు దేశాల్లో దుమారం రేపుతోంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే .. ఐటి రంగానికి చెందిన యువ ఇంజినీర్లు అమరికాలో హెచ్‌ 1బీ వీసా కింద లక్షలాది మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారతీయులు అమెజాన్‌ , గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా లాంటి అతి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా పనిచేసుకుంటున్న వారికి ట్రంప్‌ హెచ్‌1 బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులు తాము బహిరంగ ప్రదేశాల్లో తిరిగే టప్పుడు జేబులో తమ వీసాను పెట్టుకొని తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే అమెరికాలో పైన తెలిపిన అతి పెద్ద ఐటి కంపెనీల్లో పనిచేసే హెచ్‌ 1బీ ఉద్యోగులకు యాజమాన్యాలు ఒక అడ్వయిజరీ జారీ చేశాయి. ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు దేశం విడిచి వెళ్లరాదని.. ఒక వేళ మీరు దేశం నుంచి వెళితే తిరిగి అమెరికాలో అడుగుపెట్టలేరని ముందుస్తు హెచ్చరికలు చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్‌ పోస్ట్‌ దీనికి సంబంధించి ఒక వార్త కూడా ప్రచురించింది. ఇండియాకు చెందిన హెచ్‌-1బీ వీసాదారులు తమ మాతృదేశానికి వెళ్లాలనుకునే వారు బలవంతంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని తెలిపింది. కాగా పలువురు ఐటి ఉద్యోగులు వాషింగ్టన్‌ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఇండియాకు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసుకోవల్సి వచ్చిందని… ఒక వేళ ఇండియాకు వెళితే…. తిరిగి అమెరికాలో రీ ఎంట్రీ కాలేమనే భయంతోనే ఇండియాకు వెళ్లడం మానేశామని తమ బాధను వెల్లబొసుకున్నట్లు పోస్ట్‌ వెల్లడించింది.

మరో భారతీయ ఉద్యోగి ఒకరు… ట్రంప్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఇక్కడే పుట్టిన తమ పిల్లల బర్త్‌రైట్‌, సిటిజన్‌ షిప్‌ను రద్దు చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం చేశాడు. ఒక వేళ ట్రంప్‌ పిల్లల సిటిజన్‌ షిప్‌ను రద్దు చేస్తే తమ పిల్లలకు ఇటు అమెరికా పౌరసత్వం లేకుండా పోతుంది అటు ఇండియా పౌరసత్వం కూడా పోతుందని వారు ఎటు కాకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే …. అమెరికా పౌరుడు కాడు అంటే.. అతడు దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు ముద్ర వేస్తున్నారు. వెంటనే డిపోర్టేషన్‌ సెంటర్‌కు తరలించి అటు నుంచి ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి పంపుతున్నారు. ట్రంప్‌ వచ్చాక ఆయన రోజుకో కొత్త వీసా నిబంధనలు తెచ్చి తమను హడలు గొడుతున్నాడని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు చెల్లుబాటు అయ్యే హెచ్‌ 1బీ పత్రాలను తమ వెంట తీసుకువెళ్లాల్సి వస్తోందని వివరించారు.

ఇక అమెరికలో టెక్‌ ఇండస్ర్టీ విషయానికి వస్తే అక్కడి కంపెనీలు ప్రధానంగా విదేశీ ఇంజినీర్లపైనే ..ముఖ్యంగా ఇండియన్‌ ఇంజినీర్లపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఇండియాకు చెందిన ఐటి ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలు ఇన్పోసిస్‌, కాగ్నిజెంట్‌ లు తమ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసాలు ఇచ్చి అమెరికాకు పంపుతున్నాయి. సిలికాన్‌ వ్యాలీలోపనిచేసే ఒక హెచ్‌ఆర్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌తో మాట్లాడుతూ… కొంత మంది ఉద్యోగుల వీసాల గడువు ముగుస్తున్నందున తామే వీసా పొడిగింపుకు అయ్యే ఖర్చును భరిస్తున్నామని చెప్పారు. ఆలస్యం అయితే వీసా రద్దు అయతే ఉద్యోగిని దేశం నుంచి పంపించేయాల్సి వస్తుందని.. అదే సమయంలో ఐటి ఉద్యోగి తన వీసా ఆమోదం పొందే వరకు టెన్షన్‌కు గురవుతాడు. దాని ప్రభావం పనిపై పడుతుందని చెప్పారు.

అలాగే గ్రీన్‌కార్డు, విషయానికి వస్తే ఒక్కో దేశానికి ఒక్కో కోటా ఉంటుంది. ఇక అమెరికాలో ఇండయన్స్‌ లక్షలాది మంది ఉంటున్నారు. ఐటి రంగంలో పనిచేసే భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం కొన్ని దశాబ్దాలపాటు వేచి చూడాల్సి వస్తోంది. అతి పెద్ద కంపెనీల్లో పనిచేసినా వారికి గ్రీన్‌కార్డు దక్కడం లేదు. సామాన్య ఐటి ఉద్యోగిని పక్కన పెట్టండి అమెరికాలో అతి పెద్ద కంపెనీ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినా వారికి కూడా గ్రీన్‌కార్డు లభించలేదంటే పరిస్థితి ఎలా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఉదాహరణకు అమెరికాలో పర్పెలెక్సిటీ అనే ఐటీ కంపెనీని స్థాపించాడు అరవింద్‌ శ్రీవాత్సవ. కంపెనీ విలువ 9 బిలియన్‌ డాలర్లు చేరింది. వందలాంది మందికి ఉద్యోగాలు ఇచ్చినా.. తాను మూడు సంవత్సరాల నుంచి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వాపోయాడు పెర్పలెక్సిటి సీఈవో. హెచ్‌1బీ వీసా హోల్డర్ల ఆందోళనను గమనించిన ట్రంప్‌ ఇటీవల హెచ్‌-1బీ వీసా గురించి కాస్తా అనుకూలంగా మాట్లాడారు. ఇబ్బంది పెట్టనని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అమెరికాలో హెచ్‌1బీ వీసా కింద పనిచేసేవారు లక్షల్లో ఉన్నారు. అయితే హెచ్‌1బీ ప్రోగ్రాం కింద ఏడాదికి 65వేల మందికి మాత్రమే లాటరీ సిస్టమ్‌లో వీసాలు ఇస్తారు. ఇక హెచ్‌1బీ వీసాలను అత్యధికంగా వినియోగించే వారు ఇండియన్స్‌ తర్వాతి స్థానం చైనా అటు తర్వాత కనడాకు చెందిన పౌరులు వినియోగిస్తారు. కాగా అమెరికాలో అతి పెద్ద కంపెనీలు అమెజాన్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌లో పనిచేసేవారిలో ఇండియన్స్‌ ఎక్కువ. ట్రంప్‌ ఏ క్షణంలోనైనా తమ వీసాలను రద్దు చేస్తాడేమో అన్న అనుమానాలు వీరికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

అయితే హెచ్‌1బీ ఉద్యోగులను పక్కన పెడితే ఇండియా నుంచి ఎఫ్‌-1 వీసాలపై వెళ్లిన వారు.. వీరంతా స్టూడెంట్‌ వీసాలు తీసుకొని అమెరికాలో అడుగుపెట్టిన వారే. చాలా మంది అక్కడ చుదువుకుంటూనే పార్ట్‌టైం జాబ్స్‌ చేస్తుంటారు. తాజాగా ట్రంప్‌ కొత్త రూల్స్‌తో వీరంతా పార్ట్‌ టైం జాబ్‌లు చేయడం మానేశారు. ఒక వేళ పట్టుబడితే.. ఇక ఈ జన్మలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టలేమన్న భయంతో వారు పార్ట్‌టైం జాబ్‌ మానేశారు. తల్లిదండ్రుల నుంచి డబ్బు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇటు హెచ్‌1బీ వీసా హోల్డర్లకు..అటు స్టూడెంట్స్‌కు అచ్చేదన్‌ లేవని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ రెండు మూడు నెలలు హడావుడి చేసి అలిసిపోతాడని.. తిరిగి మాములు పరిస్థితులు నెలకొంటాయన్న ఆశ మన ఇండియన్స్‌లో ఉంది. మరి అమెరికాలో ఇండియన్స్‌ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.