Published On:

India-America Tariffs : భారత్ సుంకాలు తగ్గిస్తుంది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

India-America Tariffs : భారత్ సుంకాలు తగ్గిస్తుంది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

US President Donald Trump says India will reduce Tariffs: భారత్ సుంకాలు తగ్గిస్తుందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్నిరకాల వస్తువులపై ఇండియా సుంకాలు తగ్గించనున్నదనే విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏ ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

 

ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు..
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇండియా, యూఎస్ అధికారులు ఈ నెల 23వ తేదీన వాషింగ్టన్‌లో చర్చలు ప్రారంభించారు. ఇండియాలో ఒప్పందం వల్ల యూఎస్ వస్తువులకు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయని, రెండు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు వస్తాయని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. టారిఫ్, టారిఫేతర అడ్డంకులను అగ్రరాజ్యం తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ పేర్కొన్నారు.

 

షరతులకు రెండుదేశాలు తుది రూపు..
ఒప్పందానికి సంబంధించిన షరతులకు రెండుదేశాలు తుది రూపునిచ్చాయి. 90 రోజులపాటు టారిఫ్‌ అమలుకు అగ్రరాజ్యం విరామం ప్రకటించిన నేపథ్యంలో మూడు రోజుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తరఫు బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ నేతృత్వం వహిస్తున్నారు.

 

అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా మాత్రం విభిన్నంగా ఆలోచించింది. ప్రతి సుంకాలకు బదులుగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడింది. రెండు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా ఇరు దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: