US : విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అమెరికాలో బహిష్కరణపై వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కారు

Trump Govt good news for foreign students : విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్నారు. బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఉపశమనం లభించింది. విద్యార్థుల వీసాలు, చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థుల లీగల్ స్టేటస్‌ను పునరుద్ధరించింది. ఈ మేరకు అమెరికా సర్కారుకు చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు.
విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం..
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ వివిధ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాడు. కాగా, విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపాడు. ఈ నేపథ్యంలోనే వివిధ కారణాలతో 187 కళాశాలలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా, చట్టబద్ధ హోదాలను రద్దు చేశాడు. డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే అమెరికాను వీడారు. కొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. మరికొందరు తరగతులకు వెళ్లడం లేదు.
వీసాల రద్దుపై న్యాయస్థానాలను ఆశ్రయించిన విద్యార్థులు..
వీసాల రద్దుపై స్టూడెంట్స్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. వీసాలపై న్యాయస్థానాలు విచారణ జరిపాయి. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ట్రంప్ సర్కారును న్యాయస్థానాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది.
త్వరలోనే కొత్త పాలసీ..
సాధారణంగా వీసా, చట్టబద్ధ హోదా రద్దు అయినప్పుడు విదేశీ విద్యార్థుల వివరాలను పొందుపర్చే ఎస్ఈవీఐఎస్ డేటాబేస్ నుంచి వివరాలు తొలగిస్తారు. రికార్డుల టెర్మినేషన్‌కు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం త్వరలో నూతన పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు తొలగించిన విద్యార్థుల రికార్డులను తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు. వీసాలు రద్దయిన వారిలో కొంతమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చాలా చిన్న కారణాలతో చట్టబద్ధ హోదాను తొలగించినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది.