Pahalgam Terror Attack : తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఒకే ఒక్కడు

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి ఎన్నో కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 26మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని విధంగా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు పాల్పడ్డారు. దాడులకు భయపడిన పర్యాటకులు టెంటులలోకి పరుగెత్తారు. అయితే ఒక్కడు మాత్రం టూరిస్టులను రక్షించడాని ప్రయత్నించాడు. ఫైరింగ్ జరుగకుండా తీవ్రవాదుల చేతుల్లోని AK 47లను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్. ఇతను తన గుర్రంపై పర్యాటకులను పహల్గాంలోని గడ్డి మైదానాలకు చేరవేరుస్తాడు.
మంగళవారం సయ్యద్ ఆదిల్ హుస్సేన్ పర్యాటకులను పహల్గాంకు చేరవేస్తున్న క్రమంలో తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. వారిని రక్షించే క్రమంలో తీవ్రవాదుల చేతుల్లోంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే అతనిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆదిల్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది.
“పని నిమిత్తం మా కొడుకు నిన్న పహల్గాం వెళ్లాడు. అక్కడ ఉగ్రదాడి జరిగిందని తెలుసుకుని ఆదిల్ కు ఫోన్ చేశాం. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫోన్ చేయగా రింగ్ అయినా ఎత్తలేదు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో తమ కుమారుడు మరణించాడని భద్రతా దళాలు తెలిజేశాయి” అని ఆదిల్ తండ్రి సయ్యద్ హైదర్ షా కన్నీటిపర్యంతమయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత్ కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. తీవ్రవాదంపై భారత్ జరిపే పోరులో తాము కలిసిపోరాడుతామని తెలియజేశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నప్పుడు ఉగ్రదాడి జరగడం సంచలనంగా మారింది. ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత టిఆర్‌ఎఫ్ ను ఏర్పాటు చేశారు. ఇది లష్కర్ ఏ తయిబాకు అనుబంధ సంస్థ.