Mehbooba Mufti’s: ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మొదట చొరవ చూపాలి: మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

Mehbooba Mufti’s interesting comments on Operations Sindoor: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఖండంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియా మొదట చొరవ చూపించాలని ఆమె కోరారు. నాయకత్వ పాత్రను పోషించాలని సూచించారు. సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే ఇండియా నిజమైన శక్తి అని చాటిచెప్పేందుకు ఇదే మంచి తరుణమని ఆమె పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య పరస్పర దాడులపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశాడు. భారత్‌తో పెరిగిన ఉద్రికత్తలను తగ్గించుకోవాలని కోరిన నేపథ్యంలో ముఫ్తీ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య జోక్యం చేసుకోలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్‌ను ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు. నిలకడలేని అంతర్జాతీయ మద్దతు వైపు మొగ్గుకు బదులు, ఉద్రిక్తతలు తొలగేందుకు భారత్ మొదటి అడుగు వేయాలని ముఫ్తీ సూచించారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఆమె చెప్పుకొచ్చారు. వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. అలాంటి భారత్ నిలకడలేని అంతర్జాతీయ మద్దతుపై ఆధారపడకూడదని ఆమె పేర్కొన్నారు. ఉపఖండంలో నాయకత్వ పాత్రను పోషిస్తూ ఉద్రిక్తతలు తగ్గించటానికి తొలి అడుగు వేయాలని సూచించారు. ప్రపంచమంతా మన వైపే చూస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉన్నతంగా నిలబడి సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే నిజమైన బలమని, న్యూక్లియర్స్ కాదని చాటి చెప్పాలన్నారు.