Ration Cards : అత్తగారి ఊరిలో దరఖాస్తు.. అమ్మగారి ఊరిలో పేర్లు.. రేషన్ కార్డులో అన్నీ తప్పులే

Ration cards are a trap for Mistakes : కుటుంబంలోని యజమాని తన పిల్లల పేర్లను రేషన్‌కార్డుల్లో జత చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల పేర్లు తన సొంత ఊరిలో కాకుండా అత్తగారి ఊరిలో, అత్తగారి రేషన్ కార్డులో నమోదు అయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, భర్తకు తన సొంత ఊరిలో, భార్యకు అమ్మగారి ఊరిలో రేషన్ కార్డు వచ్చింది. మరో యజమాని తన ఇద్దరి పిల్లల పేర్లను జత చేయడానికి దరఖాస్తు చేసుకోగా, ఒక్కరి పేరు మాత్రమే నమోదైంది.
రేషన్‌కార్డుల జారీలో చిత్రవిచిత్రాలు..
తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన నూతన రేషన్‌కార్డుల జారీలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఒకచోట దరఖాస్తు చేస్తే మరోచోట పేర్లు వస్తున్నాయి. అత్తగారి ఇంట్లో దరఖాస్తు చేస్తే అవ్వగారి ఇంట్లో ప్రత్యేక్షమవుతున్నాయి. పిల్లల పేర్లు ఒకచోట తల్లిదండ్రుల పేర్లు మరోచోట వస్తున్నాయి. భర్త పేరు ఒకచోట భార్య పేరు మరోచోట దర్శనం ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అర్హులైనవారి పేర్లు గల్లంతవుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త రేషన్‌కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్లు జత చేయడం, తొలగింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా గ్రామ సభలతోపాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకున్నది.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
కొత్త రేషన్ కార్డులు, పేర్ల నమోదు ప్రక్రియలో సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం మనకు కనిపిస్తున్నది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా అన్నింటినీ కలిపేశారని తెలిసింది. కంప్యూటర్ ఆపరేటర్లకు దరఖాస్తులను అప్పగించడంతోనే గందరగోళం నెలకొంది. దరఖాస్తులను కంప్యూటర్‌లో నమోదు చేసే క్రమంలో ఇంటి పేర్లు, ఆధార్ కార్డులను జత చేయడంతో తప్పులు జరిగినట్లు తెలిసింది.
దరఖాస్తుదారులు షాక్..
గ్రామాల్లో కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాలు వెల్లడించారు. జాబితాలో పేర్లు చూసిన దరఖాస్తుదారులు షాక్‌కు గురయ్యారు. 10 పేర్లలో కనీసం ఐదు పేర్లు తప్పుల తడకగా ఉన్నట్లు తెలిసింది. లబ్ధిదారులు సివిల్ సప్లై, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తప్పులపై అధికారులను ప్రశ్నిస్తే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు.
కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారో.?
కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తారు? ఎప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారు? అనే అంశంపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు అందాలి. ఆ తర్వాత గడువును ఉగాదికి పొడగించింది. కానీ, ఇప్పటివరకు కొత్త కార్డులు జారీ కాలేదు.