CM Revanth Reddy : ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదు : ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy responds to Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలిపారు. బుధవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి సమయంలో రాజకీయలకు తావు లేదని స్పష్టం చేశారు.
అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులందరూ 24గంటలు అందుబాటులో ఉండాలని కోరారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నెంబర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.
భారత పౌరుడిగా గర్వంగా ఉంది..
పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయమిదంటూ జైహింద్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్‌ను స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్‌కు రావాలని సూచించారు.