ACB : గొర్రెల స్కామ్ ఏ-1 నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్.. దర్యాప్తులో కీలక పరిణామం

Sheep distribution Scam : తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-1 నిందితుడు మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసింది. ఇవాళ ఉదయం ఏ-1 నిందితుడు మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో మొయినుద్దీన్‌పై పోలీసులు ఎల్‌ఓసీ జారీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి..
కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారుడితో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాగానే మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో మొయినుద్దీన్‌దే కీలకపాత్ర అని అధికారుల విచారణలో వెల్లడైంది.
మొయినుద్దీన్ నివాసాల్లో సోదాలు..
మొయినుద్దీన్ ఈ స్కామ్‌లో గొర్రెల కొనుగోలు కంట్రాక్టరుగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గురువారం అతడికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. గొర్రెల స్కామ్‌లో రాంచందర్, కళ్యాణ్ పాత్ర స్పష్టమైంది. వీరిద్దరూ కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని తెలంగాణ వ్యాప్తంగా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హజరు పర్చగా, 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించింది.