MLC Candidates : వీడని ఉత్కంఠ.. పూర్తికాని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

MLC Candidates : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. నామిషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రంలోగా ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. సభలో ఉన్న సభ్యుల ఆధారంగా పోటీ చేసిన అభ్యర్థులకు విజయం దక్కుతుంది. అసెంబ్లీలో దాదాపు కూటమి మెజార్టీగా ఉండటంతో ఐదు స్థానాలు దక్కనున్నాయి. ఈ ఐదింటిలో పొత్తులో భాగంగా ఒకటి మిత్ర పక్షమైన జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలు కూడా టీడీపీకి దక్కనున్నాయి.
అభ్యర్థుల కోసం వడపోత..
నామినేషన్ దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు చూస్తున్నారు. ఎవరికి చోటు దక్కుతుందా అనే ఉత్కంఠ గంట గంటకు పెరుగుతోంది. ఈ నాలుగు స్థానాలు కూడా గతంలో సీట్లు త్యాగం చేసినవారికి ముందుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వారు, సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కుల, మత, ప్రాంత సమీకరణను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. ఆశావహుల జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, వంగవీటి రాధ, జవహర్, బుద్ధా వెంకన్న, శ్రీరాం చిన్నబాబు, బీద రవి, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, మోపిదేవి వెంకటరమణ, పరసా రత్నం, నాగుల్ మీరా, ఎండీ నజీర్ ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ వడపోత తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.